🏠 cm9news.in
Watermark
Clip Header Logo
Date of Publish : 16 October 2026, 6:59 pm Posted by : CM9NEWS

స్థానిక సంస్థల ఎన్నికల్లో బిసి, ఎస్పీ, ఎస్టీలకు మెజారిటీ స్థానాలు కేటాయించాలి!

News Image
CM9NEWS: కావలి: రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు మెజారిటీ స్థానాలు కేటాయించాలని బీసీ ఐక్య వేదిక కావలి నియోజకవర్గ కన్వీనర్‌, న్యాయవాది బెజవాడ అభిసాగర్ ప్రజాపతి, బీసీ ఐక్యత భవన్ అధ్యక్షుడు అద్దంకి ప్రభాకర్ డిమాండ్ చేశారు. బడుగు, బలహీన వర్గాలకు రాజకీయ పార్టీలు తగిన ప్రాతినిధ్యం కల్పించకపోతే, ఆయా వర్గాల నాయకులు స్వతంత్ర అభ్యర్థులుగా ఎన్నికల బరిలోకి దిగేందుకు సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు.
శుక్రవారం కావలి పట్టణంలోని జర్నలిస్ట్ క్లబ్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ.. బీసీలను కేవలం ఓటు బ్యాంకుగా చూడకుండా, ఓపెన్ కేటగిరీలోనూ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు తగిన అవకాశాలు కల్పించాలని అన్ని రాజకీయ పార్టీలను కోరారు. రానున్న కావలి మున్సిపల్ ఎన్నికల్లో చైర్‌పర్సన్ పదవిని ఎస్సీ అభ్యర్థికి కేటాయించి, సామాజిక న్యాయానికి ప్రాధాన్యం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
అధికార తెలుగుదేశం పార్టీతో పాటు వైఎస్సార్‌సీపీ కూడా బీసీలపై కపట ప్రేమను ప్రదర్శించడం మానుకోవాలని వారు విమర్శించారు. బీసీల జనాభా దామాషా ప్రకారం రాజకీయ పదవులు, ఎన్నికల అవకాశాలు కల్పించాలని స్పష్టం చేశారు. రాజకీయ పార్టీలు తమ డిమాండ్లపై స్పందించకపోతే బీసీ సంఘాల ఆధ్వర్యంలో బలమైన ఉద్యమాలు చేపట్టేందుకు బీసీ సమాజం సిద్ధంగా ఉందని హెచ్చరించారు.
రానున్న సార్వత్రిక ఎన్నికల్లో నెల్లూరు జిల్లా నుంచి అన్ని రాజకీయ పార్టీలు ఒక ఎంపీ, రెండు ఎమ్మెల్యే స్థానాలను బీసీలకు కేటాయించాలని వారు డిమాండ్ చేశారు.
ఈ సమావేశంలో బీసీ నాయకులు గుంజి నరేష్ వడియరాజ్, న్యాయవాది వట్టికాల రామ్ వినోద్ తదితరులు పాల్గొన్నారు.
🏠 Home