🏠 cm9news.in
Watermark
Clip Header Logo
Date of Publish : 12 November 2026, 4:23 pm Posted by : CM9NEWS

సత్యవోలు సర్పంచ్ బరిలో గద్దె వెంకటలక్ష్మి..

News Image
CM9NEWS కొండాపురం :కొండాపురం మండలం సత్యవోలు గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా గద్దె వెంకటలక్ష్మి ఎన్నికల బరిలో నిలవనున్నట్లు ఆమె కుమారుడు, ఉదయగిరి నియోజకవర్గ తెలుగు యువత కార్యదర్శి గద్దె రామకృష్ణ గురువారం అమెరికా నుంచి ఒక ప్రకటనలో వెల్లడించారు.గత పదేళ్లుగా తెలుగుదేశం పార్టీ కోసం స్వంత నిధులతో అనేక కార్యక్రమాలు చేపట్టడంతో పాటు గ్రామ అభివృద్ధికి తన వంతు కృషి చేశానని ఆయన తెలిపారు. నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర విజయవంతం కావాలని ఆకాంక్షిస్తూ సత్యవోలు నుంచి మలకొండలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం వరకు పాదయాత్ర నిర్వహించినట్లు గుర్తుచేశారు. అలాగే ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ విజయానికి అహర్నిశలు కృషి చేశానని పేర్కొన్నారు.
గ్రామ పంచాయతీ అభివృద్ధే లక్ష్యంగా ఈసారి తన కుటుంబం ఎన్నికల బరిలో నిలుస్తోందని, గ్రామ ప్రజలందరూ పెద్ద మనసుతో ఆదరించి తన తల్లి గద్దె వెంకటలక్ష్మిని సర్పంచ్‌గా గెలిపించాలని రామకృష్ణ విజ్ఞప్తి చేశారు.ఇదిలా ఉండగా, తాను, తన కుటుంబ సభ్యులు తెలుగుదేశం పార్టీని వీడి ఇతర పార్టీల్లో చేరుతున్నారంటూ కొందరు వ్యక్తులు గ్రామంలో, మండలంలో అసత్య ప్రచారం చేస్తున్నారని ఆయన ఖండించారు. తన తల్లిలాంటి తెలుగుదేశం పార్టీని వీడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. జీవితాంతం టీడీపీలోనే కొనసాగుతానని, కష్టమైనా, నష్టమైనా తన పార్టీ తెలుగుదేశమేనని, తన జెండా కూడా టీడీపీ జెండానేనని తేల్చిచెప్పారు.ప్యాకేజీల కోసం పార్టీలు మారే వ్యక్తిత్వం తనది కాదని, అలాంటి పరిస్థితి తనకు ఎప్పటికీ రాదని గద్దె రామకృష్ణ స్పష్టం చేశారు.
🏠 Home