🏠 cm9news.in
Watermark
Clip Header Logo
Date of Publish : 13 November 2026, 9:19 pm Posted by : CM9NEWS

కావలి వైసీపీ చైర్మన్ అభ్యర్థిగా కేతిరెడ్డి శివకుమార్ రెడ్డి!

News Image
CM9NEWS: కావలి: కావలి మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పట్టణ అధ్యక్షుడు కేతిరెడ్డి శివకుమార్ రెడ్డిని ఎంపిక చేసింది. కావలి వైసీపీ ఇన్‌ఛార్జ్, మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి ఆయన అభ్యర్థిత్వాన్ని ప్రకటించారు.

గత 30 ఏళ్లకు పైగా రాజకీయాల్లో క్రియాశీలకంగా కొనసాగుతున్న కేతిరెడ్డి శివకుమార్ రెడ్డికి పార్టీలో సౌమ్యుడిగా, వివాదరహితుడిగా మంచి గుర్తింపు ఉంది. పార్టీ పట్ల నిబద్ధతతో పనిచేస్తూ పట్టణ స్థాయిలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. అయితే మున్సిపల్ ఎన్నికల బరిలో ఆయన తొలిసారిగా పోటీ చేయబోతుండటం విశేషం.

వైసీపీ చైర్మన్ అభ్యర్థిని ప్రకటించడంతో కావలి మున్సిపల్ రాజకీయాల్లో ఎన్నికల వేడి మరింత పెరిగింది. ఇప్పటికే ప్రధాన పార్టీల మధ్య రాజకీయ సమీకరణాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో చైర్మన్ పీఠం దక్కించుకోవడానికి అవసరమైన రాజకీయ బలాబలాలపై చర్చ మొదలైంది.

ముఖ్యంగా బీజేపీ వైఖరి, ఆ పార్టీ తీసుకోబోయే నిర్ణయం కావలి మున్సిపల్ చైర్మన్ ఎన్నికల్లో కీలకంగా మారనుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వైసీపీ తన అభ్యర్థిని ప్రకటించడంతో ఇప్పుడు బీజేపీ ఎలాంటి వ్యూహంతో ముందుకు వెళ్తుందన్నది రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చగా మారింది.
🏠 Home