Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

జెడ్పీ చైర్మన్ రేసులో మాలేపాటి కుటుంబం!

జెడ్పీ చైర్మన్ రేసులో మాలేపాటి కుటుంబం!

CM9NEWS: పార్టీ కోసం ఆర్థికంగా నష్టపోయినా.. కుటుంబంలో తీరని విషాదం ఎదురైనా.. తెలుగుదేశం జెండాను వీడని కుటుంబం మాలేపాటిది. నాడు రామానాయుడు నుంచి నేడు రవీంద్రనాయుడు, లోకేష్ వరకు పార్టీనే నమ్ముకుని రాజకీయ ప్రస్థానం సాగిస్తున్న మాలేపాటి కుటుంబానికి ఈసారి జెడ్పీ చైర్మన్ అవకాశం దక్కుతుందా? పార్టీ కోసం చేసిన త్యాగాలకు తగిన గుర్తింపు లభిస్తుందా? కావలి రాజకీయ వర్గాల్లో ఇప్పుడు ఇదే చర్చ!

కావలి: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో జెడ్పీ చైర్మన్ పదవికి ఓసీ జనరల్ రిజర్వేషన్ ఖరారు కావడంతో ఆశావహుల్లో పోటీ తీవ్రతరమైంది. ఈ కీలక పదవిని దక్కించుకునేందుకు పలువురు నేతలు తమ ప్రయత్నాలను ముమ్మరం చేస్తుండగా.. తెలుగుదేశం పార్టీ కోసం ఎన్నో ఏళ్లుగా నిబద్ధతతో పనిచేస్తున్న మాలేపాటి కుటుంబం పేరు మరోసారి బలంగా వినిపిస్తోంది. పార్టీ కష్టకాలంలోనూ వెన్నుచూపకుండా నిలిచిన ఈ కుటుంబానికి ఈసారి అవకాశం కల్పించాలనే డిమాండ్ అనుచరుల నుంచి వినిపిస్తోంది.

*మాలేపాటి అంటే టీడీపీ.. టీడీపీ అంటే మాలేపాటి కుటుంబం!*

తెలుగుదేశం పార్టీతో మాలేపాటి కుటుంబానికి ఉన్న అనుబంధం నిన్నటిది కాదు. నాడు మాలేపాటి రామానాయుడు నుంచి నేడు మాలేపాటి రవీంద్రనాయుడు, మాలేపాటి సుబ్బానాయుడు, వారి కుటుంబానికి చెందిన యువ నాయకుడు మాలేపాటి భానుచందర్ నాయుడు, మాలేపాటి లోకేష్ వరకు పార్టీ పట్ల విధేయతతో పనిచేసిన చరిత్ర ఈ కుటుంబానిది. పార్టీ ఏ బాధ్యత అప్పగించినా.. ఆర్థిక పరిస్థితులు అనుకూలించినా, లేకపోయినా.. పార్టీ నిర్ణయానికి కట్టుబడి ముందుకు సాగడమే తమ రాజకీయ సిద్ధాంతంగా ఈ కుటుంబం నిరూపించుకుందని వారి అనుచరులు చెబుతున్నారు.

*పార్టీ కష్టకాలంలో ముందుకొచ్చిన సుబ్బానాయుడు.. పదవి కంటే పార్టీనే మిన్నగా భావించిన నేత!*

2019లో తెలుగుదేశం పార్టీ ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొన్న సమయంలో కావలి నియోజకవర్గ ఇన్‌చార్జి బాధ్యతలు చేపట్టేందుకు ఎవరూ ముందుకు రాని పరిస్థితుల్లో మాలేపాటి సుబ్బానాయుడు బాధ్యతను స్వీకరించారు. వైసీపీపై రాజకీయ పోరాటం సాగిస్తూ, కేసులు ఎదురైనా వెనుకడుగు వేయకుండా పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేశారని పార్టీ శ్రేణులు గుర్తుచేస్తున్నాయి.

అంతేకాదు.. పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఎమ్మెల్యే సీటును సైతం త్యాగం చేసిన నాయకుడిగా సుబ్బానాయుడికి పార్టీలో ప్రత్యేక గుర్తింపు ఉంది. వ్యక్తిగత రాజకీయ ప్రయోజనాల కంటే పార్టీ ప్రయోజనాలకే ప్రాధాన్యమిచ్చిన ఆయన.. అనంతరం కూడా పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా కొనసాగారు. అయితే, ఆయన అకాల మరణం మాలేపాటి కుటుంబానికే కాకుండా పార్టీ శ్రేణులకు సైతం తీరని లోటుగా మిగిలింది.

ఇదే సమయంలో కుటుంబానికి అండగా నిలిచిన యువ నాయకుడు మాలేపాటి భానుచందర్ నాయుడు కూడా మృత్యువాత పడటంతో ఆ కుటుంబం ఒకేసారి రెండు పెద్ద విషాదాలను ఎదుర్కొంది. పార్టీ కోసం రాజకీయంగా, ఆర్థికంగా శ్రమించిన కుటుంబానికి వ్యక్తిగతంగా ఎదురైన ఈ నష్టాలు మరింత వేదనను మిగిల్చాయి.

*మాలేపాటి కుటుంబానికి అండగా ఉంటామన్న చంద్రబాబు, లోకేష్!*

మాలేపాటి కుటుంబం ఎదుర్కొన్న విషాదంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ విచారం వ్యక్తం చేసి, ఆ కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చినట్లు పార్టీ వర్గాలు గుర్తుచేస్తున్నాయి. ముఖ్యంగా మంత్రి నారా లోకేష్ దగదర్తి మండలంలోని మాలేపాటి కుటుంబ స్వగ్రామానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించడం అప్పట్లో ప్రాధాన్యత సంతరించుకుంది.

ఆ సమయంలో మాలేపాటి కుటుంబ రాజకీయ భవిష్యత్తుకు తాను అండగా ఉంటానని లోకేష్ భరోసా ఇచ్చినట్లు వారి అనుచరులు పేర్కొంటున్నారు. దీంతో ఇప్పుడు జెడ్పీ చైర్మన్ పదవి రూపంలో ఆ కుటుంబానికి రాజకీయంగా సముచిత అవకాశం కల్పిస్తారా? గతంలో ఇచ్చిన భరోసాకు అనుగుణంగా అడుగులు పడతాయా? అనే ప్రశ్నలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారుతున్నాయి.

*విషాదాన్ని దిగమింగి.. ప్రజల మధ్యకు తిరిగి వచ్చిన కుటుంబం!*

కుటుంబంలో ఇద్దరు కీలక వ్యక్తులను కోల్పోయినా మాలేపాటి కుటుంబం రాజకీయాలకు దూరం కాలేదు. మాలేపాటి రవీంద్రనాయుడు, యువ నాయకుడు మాలేపాటి లోకేష్ తిరిగి ప్రజల్లోకి వచ్చి మండల ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారని వారి అనుచరులు చెబుతున్నారు. తమను నమ్ముకున్న ప్రజలకు అందుబాటులో ఉంటూ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారని పేర్కొంటున్నారు.

గతంలో మాలేపాటి రామానాయుడు జెడ్పీ ఫ్లోర్ లీడర్‌గా పనిచేసిన అనుభవం కూడా ఈ కుటుంబానికి ఉంది. దీంతో జెడ్పీ రాజకీయాలపై అవగాహన, పార్టీతో దీర్ఘకాలిక అనుబంధం, క్షేత్రస్థాయిలో కార్యకర్తలతో సంబంధాలు తమకు అనుకూల అంశాలుగా మాలేపాటి కుటుంబ అనుచరులు భావిస్తున్నారు.

*త్యాగాలకు గుర్తింపు దక్కేనా?.. టీడీపీ అధిష్ఠానం నిర్ణయంపైనే ఉత్కంఠ!*

జెడ్పీ చైర్మన్ పదవికి ఓసీ జనరల్ రిజర్వేషన్ ఖరారు కావడంతో మాలేపాటి రవీంద్రనాయుడు లేదా యువ నాయకుడు మాలేపాటి లోకేష్‌లో ఒకరికి అవకాశం కల్పించాలని వారి అనుచరులు తెలుగుదేశం పార్టీ అధిష్ఠానాన్ని కోరుతున్నారు.

పార్టీ కోసం ఎన్నో ఏళ్లుగా పనిచేసిన కుటుంబం.. కష్టకాలంలో బాధ్యతలు స్వీకరించిన నాయకత్వం.. పార్టీ నిర్ణయం కోసం పదవిని సైతం త్యాగం చేసిన నేపథ్యం.. తీరని కుటుంబ విషాదాన్ని ఎదుర్కొన్నా పార్టీని వీడని విధేయత.. ఇవన్నీ పరిగణనలోకి తీసుకుని మాలేపాటి కుటుంబానికి సముచిత ప్రాధాన్యం ఇవ్వాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు.

అయితే, జెడ్పీ చైర్మన్ అభ్యర్థి ఎంపికపై పార్టీ అధిష్ఠానం నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. మాలేపాటి కుటుంబం చేసిన సేవలకు గుర్తింపుగా అవకాశం కల్పిస్తారా? లేక ఇతర ఆశావహులకు ప్రాధాన్యం ఇస్తారా? అనేది వేచి చూడాలి.

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: